: సియాచిన్ లో అద్భుతం... 6 రోజుల తర్వాత మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన జవాను
సియాచిన్ లో అద్భుతం చోటుచేసుకుంది. మంచు తుపానులో చిక్కుకుని పది మంది భారత సైనికులు చనిపోయినట్లు సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఓ జవాను ఆరు రోజుల తరువాత మృత్యుంజయుడిగా తిరిగొచ్చాడు. ఇక మిగిలిన తొమ్మిది మంది సైనికులు చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఆరు రోజుల క్రితం చోటుచేసుకున్న ప్రమాదంలో పది మంది సైనికులు చిక్కుకుపోయారు. అసలు వారు చనిపోయారో, లేక ఎక్కడైనా సురక్షితంగా ఉన్నారో తెలియక సైన్యం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో అక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేసిన సైనికాధికారులు గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని ప్రకటించారు. వీరి మృతదేహాల కోసం నిర్వహిస్తున్న గాలింపులో భాగంగా నిన్న లాన్స్ నాయక్ హనుమంతప్ప సజీవంగా కనిపించాడు. ఆరు రోజులుగా మంచు కిందే ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్న హనుమంతప్పను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు జీఓసీ నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తెలిపారు. అయితే మిగిలిన వారంతా మంచు గడ్డల కింద నలిగిపోయి మరణించారని ఆయన పేర్కొన్నారు. హనుమంతప్ప పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు హుడా తెలిపారు.