: ఐఏఎస్ బీపీ ఆచార్యకు షాక్!... జగన్ కేసులో ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి
సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు కేంద్ర ప్రభుత్వం నిన్న భారీ షాకిచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ‘ఇందూ’ కేసులో బీపీ ఆచార్య తొమ్మిదో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. క్విడ్ ప్రోకోకు చెందిన ఈ కేసులో జగన్ అరెస్టయిన సందర్భంగా ఆచార్యను కూడా సీబీఐ అదికారులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న ఆచార్య ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. నాడు ఏపీఐఐసీ ఎండీగా ఉన్న ఆయన... జగన్ కంపెనీల్లో క్విడ్ ప్రోకో పెట్టుబడులకు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఆయనపై చార్జిషీట్ కూడా దాఖలైంది. అయితే ఆయనను అవినీతి నిరోధక చట్టం కింద విచారించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి. ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నేపథ్యంలో వారిని విచారించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు బీపీ ఆచార్యను ప్రశ్నించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కేంద్రం... బీపీ ఆచార్యను అవినీతి నిరోధక చట్టం కింద ప్రశ్నించేందుకు అనుమతినిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఆమోదం తీసుకున్న కేంద్రం ఆచార్య విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.