: నాకు రాష్ట్రపతిని కావాలని ఉంది: కత్రినా కైఫ్
రాష్ట్రపతిని అవ్వాలనే కోరిక తనకు ఉందని బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ నవ్వుతూ చెప్పింది. ఈ నెల 12న విడుదల కానున్న 'ఫితూర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఒక టీవీ షోలో ఆమె పాల్గొంది. ఫితూర్ అంటే ఒక విధమైన పిచ్చి అని అర్థం. అందుకే, దీనిని దృష్టిలో పెట్టుకునే ‘సినిమాలు కాకుండా మీ మనసులో మెదులుతున్న ‘ఫితూర్’ ఏమిటి?’ అన్న ప్రశ్నకు కత్రినా పైవిధంగా సమాధానమిచ్చింది. ప్రస్తుతానికి తన మనస్సులో మెదులుతున్న ‘ఫితూర్’ రాష్ట్రపతి కావాలనేదే అని చెప్పింది. ఏదైనా సాధించాలని అనుకుంటే, ఎప్పటికైనా దానిని సాధించి తీరుతానని, మరి, ఈ విషయంలో ఏమవుతుందో చూడాలని చెబుతూ, కత్రినా చిరునవ్వులు చిందించింది. ఏమైనా, ఆమె 'ఫితూర్' మాత్రం పెద్దదే అని చెప్పుకోవాలి.