: మయన్మార్ అధ్యక్షురాలిగా అంగ్ సాన్ సూకీ?
మయన్మార్ లో సుదీర్ఘ సైనిక పాలనకు తెరపడనుందా? ప్రజాస్వామ్యం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న అంగ్ సాన్ సూకీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు సైనికాధికారులు అంగీకరించినప్పటికీ, పార్లమెంటులో వారు కూడా భాగస్వాములు కావడం మయన్మార్ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో, మయన్మార్ కు సైనిక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు మార్చి 17న ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడి పదవీ కాలం మార్చి 30 నాటికి ముగియనుంది. దీంతో 664 మంది సభ్యులు గల పార్లమెంటులో అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకానికి సంబంధించిన ఓటింగ్ ను మార్చి 17లోపు నిర్వహించనున్నారు. ఇందులో ఎక్కువ ఓట్లు సాధించిన వారు అధ్యక్షులుగా, తక్కువ ఓట్లు సాధించిన వారు ఉపాధ్యక్షులుగా ఎన్నికకానున్నారు. కాగా, మయన్మార్ చట్టాల ప్రకారం ఆ దేశాధ్యక్ష పదవి చేపట్టాలంటే మయన్మార్ దేశీయులే అయి ఉండాలన్నది, విదేశీయుడ్ని వివాహం చేసుకుని ఉండకూడదు అన్నది ప్రధాన నిబంధన. కానీ, మయన్మార్ దేశీయులు అత్యంత ఆదరించే అంగ్ సాన్ సూకీ బ్రిటన్ దేశీయుడ్ని వివాహం చేసుకుని, ఇద్దరి పిల్లలకు తల్లి అయినందున ఆమెకు అధ్యక్షపదవి చేపట్టే అవకాశం లేదు. అయితే, ఆ దేశ ప్రజలు మాత్రం అధ్యక్షురాలిగా అంగ్ సాన్ సూకీ పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆధీనంలో ఉన్న నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్ డీ) కి చెందిన నేతలు రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ను సవరించే విధంగా ఆర్మీ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ దేశ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 59ని సవరించేందుకు సముఖంగా ఉన్నట్టు సమాచారం. అలా జరిగితే ఆ దేశీయులు ఎంతో అభిమానించే అంగ్ సాన్ సాకీ మయన్మార్ అధ్యక్షురాలుగా పదవీ ప్రమాణం చేయనున్నారు.