: అపరిచిత వ్యక్తి కోసం చెన్నైవాసి త్యాగం... మానవత్వం ఇంకా మిగిలే వుందని చాటిన ఆటోవాలా!
ఓ అపరిచిత వ్యక్తి కోసం చెన్నైకు చెందిన ఆటో డ్రైవర్ రవిచంద్రన్ చేసిన సహాయం అందరినీ కదిలిస్తోంది. జీవనాధారం కోసం రవిచంద్రన్ ఆటో నడుపుతుంటాడు. ఇటీవల ఓ రోజు అతని ఆటోలో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ వృద్ధుడు ఎక్కాడు. మధ్యలో ఆయనకు గుండెపోటు రావడంతో రవిచంద్రన్ వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. పరీక్షించిన వైద్యులు వృద్ధుడికి వెంటనే ఆపరేషన్ చేయాలని, అందుకు లక్ష రూపాయల ఖర్చవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన బంధువులకు తెలపగా కుమారుడు వెంటనే వచ్చాడు. కానీ ఆపరేషన్ చేయించేంత డబ్బు అతనివద్ద లేదని రవి తెలుసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యాన్ని బతిమిలాడగా చివరకు రూ.47 వేలకు ఆపరేషన్ చేస్తామన్నారు. వృద్ధుడి కుమారుడి వద్ద రూ.15వేలు మాత్రమే ఉన్నాయి. మిగతా డబ్బు కోసం రవి మరో ఆలోచన లేకుండా, తన ఆటోను తాకట్టుపెట్టాడు. అలా వచ్చిన మొత్తాన్ని ఆపరేషన్ కి ఖర్చుపెట్టాడు. ఏమాత్రం పరిచయంలేని ఓ వ్యక్తి పట్ల రవిచంద్రన్ చూపిన మానవత్వం ఇప్పుడు అందరినీ ఎంతగానో కదిలిస్తోంది. ఈ క్రమంలో 'అన్నా ఆటో వెల్ఫేర్ ట్రస్టు' వారు అతనిని ఘనంగా సన్మానించారు కూడా.