: కొంపముంచిన యూరప్... రూ. 1.2 లక్షల కోట్లు హాంఫట్!
సెషన్ ఆరంభం నుంచి క్రితం ముగింపునకు అటూ ఇటుగా కదులుతూ, అత్యధిక సమయం స్వల్ప లాభాల్లో నిలిచిన బెంచ్ మార్క్ సూచికలు, యూరప్ మార్కెట్ల ప్రాథమిక నష్టాలతో భారీ నష్టాల్లోకి జారిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 24,700 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, గంటన్నర వ్యవధిలో 24,198 పాయింట్లకు దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించగా, స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు బులియన్ మార్కెట్ కు తరలుతున్నట్టు కనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు మధ్యాహ్నం తరువాత లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే రూ. 1.20 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 329.55 పాయింట్లు పడిపోయి 1.34 శాతం నష్టంతో 24,287.42 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 101.85 పాయింట్లు పడిపోయి 1.36 శాతం నష్టంతో 7,387.25 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.23 శాతం, స్మాల్ క్యాప్ 0.02 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 12 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బోష్ లిమిటెడ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వీఈడీఎల్, కోటక్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 92,16,341 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మొత్తం 2,801 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,193 కంపెనీలు లాభాల్లోను, 1,478 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి.