: ఐఎఫ్ఆర్ భారత దేశానికే గర్వకారణంగా నిలిచింది: చంద్రబాబు
విశాఖపట్టణంలో ఏషియన్ గేమ్స్ నిర్వహించినా ఇంత గొప్ప ప్రాచుర్యం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను నిర్వహించేందుకు విశాఖపట్టణంలో కొత్త రోడ్లు వేశామని చెప్పారు. ఆర్ అండ్ బీ సుమారు 44 కిలోమీటర్ల దూరం రోడ్లు వేసిందని ఆయన తెలిపారు. ఇందుకు 84 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన వివరించారు. అలాగే, అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ, గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ 23 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, పోర్టు ట్రస్టు 40 కోట్ల రూపాయలు వెచ్చించిందని ఆయన వివరించారు. వీటితో పాటు నేవల్ బేస్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఒసీ, బొర్రా కేవ్స్ తదితర సంస్థలన్నీ ఆయా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాయని ఆయన తెలిపారు. ఐఎఫ్ఆర్ లో భద్రత కోసం సుమారు 15వేల మంది పోలీసులను మోహరించామని చెప్పారు. వారికోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. అందుకే ఐఎఫ్ఆర్ లో రవ్వంత తప్పు కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సంబరాలు వీక్షించేందుకు 6 లక్షల మంది విశాఖ బీచ్ రోడ్ కు తరలి వచ్చారని ఆయన అన్నారు. ఇంత పెద్ద జనసందోహం వచ్చినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాలుగు రోజుల పాటు ఇంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం గర్వకారణమని ఆయన చెప్పారు. ఇంత క్రమశిక్షణతో మెలిగిన విశాఖ వాసులకు ధన్యవాదాలని ఆయన తెలిపారు.