: తొమ్మిది నెలల లోపే కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది: అచ్చెన్నాయుడు
కాపులకు న్యాయం చేయాలనే ఉద్దశంతోనే ప్రభుత్వం కమిషన్ వేసిందని ...తొమ్మిది నెలల లోపే కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చాలనే సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇందుకు సంబంధించి కమిషన్ వేసి ఇప్పటికే రెండు నెలలు పూర్తయిందని అన్నారు. కమిషన్ నివేదికకు 9 నెలలు గడువు విధించామని, అయితే, ఆ లోపే నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఏ వర్గానికి ఇబ్బంది లేని పరిష్కారం కోసమే తాము ప్రయత్నిస్తున్నామని, కాపుల్లో పేదలకు ఆర్థికసాయం చేయాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి ఆర్థిక సాయం చేస్తామని అచ్చెన్నాయుడు వివరించారు. కాపు రిజర్వేషన్ల ముసుగులో కొన్ని శక్తులు ప్రవేశించాయని, హింసకు పాల్పడిన ఘటనపై సీఎం చాలా బాధపడ్డారని అన్నారు. బయటి వ్యక్తులు వచ్చి హింసాకాండకు పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే కేసులు నమోదు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంయమనంతో ఉండాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదని..ఓపికతో ఉండి సమస్యలు పరిష్కరించుకుందామని అచ్చెన్నాయుడు అన్నారు.