: రైల్వే లోగో నుంచి మాయం కానున్న మూడు సింహాలు, 'సత్యమేవ జయతే'!
ఇండియన్ రైల్వేస్ లోగోపై పాత తరం బొగ్గు ఇంజన్, దానిపై మూడు సింహాల ముద్ర, కింద 'సత్యమేవ జయతే' అన్న అక్షరాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. రైల్వే స్టేషన్ల లోని డస్ట్ బిన్ ల నుంచి టాయ్ లెట్లలోని అద్దాలు, ఉమ్మితొట్లు తదితరాలన్నింటిపైనా ఈ లోగో కనిపిస్తూనే ఉంటుంది. అయితే, జాతి గౌరవించాల్సిన మూడు సింహాలు, సత్యమేవ జయతే అన్న పదాలను ఉమ్మితొట్లు, డస్ట్ బిన్ లు తదితర ప్రాంతాల్లో ముద్రించే లోగోలపై ఇకపై ఉంచరాదని రైల్వే శాఖ నిర్ణయించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పశ్చిమ రైల్వే తొలుత సింహాల బొమ్మ, భారత సూక్తి లేని లోగోను విడుదల చేసి, వాటిని చెత్త వేసేందుకు వాడే కవర్లపై ముద్రించింది. జాతీయ చిహ్నంపై ఉమ్మి వేయడం తదితర పనులు దేశానికే అగౌరవమని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ అధికారి తెలిపారు. దశలవారీగా అన్ని రైల్వే జోన్లు, స్టేషన్లకు కొత్త డస్ట్ బిన్ లు అందిస్తామని వివరించారు. వీటిని వాడటానికి తమకు ఇబ్బందిగా ఉందని పలువురు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు పశ్చిమ రైల్వే పీఆర్ఓ రవీంధ్ర బాకర్ తెలియజేశారు.