: హెడ్లీ అప్రూవర్ గా మారడం వెనుక కథ!


భారత్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు పాకిస్థాన్ నిత్యం యత్నిస్తూనే ఉంటుంది. ఇందుకోసం అందుబాటులోని అన్ని మార్గాలను కూడా ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) వాడుకుంటోంది. ఇందుకు ఉదాహరణే ముంబై దాడులు. ఈ దాడులకు పథక రచన చేయడంలో కీలకంగా వ్యవహరించిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ నోరు విప్పకుంటే, ఐఎస్ఐ పాత్ర అంతగా తేటతెల్లం అయ్యేది కాదేమో. దాడులకు వ్యూహాన్ని రచించి నిక్షేపంగా తప్పించుకుని అమెరికా చేరిన అతడు అక్కడి పోలీసుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. అతడిపై అమెరికా పోలీసులు నమోదు చేసిన అభియోగాలు నిజమని తేలడంతో ఆ దేశ కోర్టు అతడికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తయ్యేలోగా అతడు చస్తాడో, బతుకుతాడో కూడా తెలియదు. అంటే జీవితాంతం అతడు దాదాపుగా జైల్లోనే ఉంటాడు. ఈ క్రమంలో అతడు భారత్ లో నమోదైన కేసులో అప్రూవర్ గా మారాడు. జీవితాంతం జైలు శిక్ష పడ్డ అతడు అప్రూవర్ గా మారితే ఏమొస్తుంది? అతడికేమీ లాభం లేదు. మరి అప్రూవర్ గా ఎలా మారాడు? మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చాతుర్యం ఇక్కడ బాగా పనిచేసింది. నాలుగు నెలల క్రితం హెడ్లీపై దృష్టి సారించిన దోవల్ అమెరికాకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ముంబై దాడుల వ్యూహంలో కీలక భూమిక పోషించిన అతడిని భారత్ కు అప్పగించే విషయంపై ఆ అధికారులతో అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి చేయించారు. ఈ క్రమంలోనే భారత్ వస్తే ఎక్కడ మరింత కఠిన శిక్ష పడుతుందోనన్న భయంతో హెడ్లీ అప్రూవర్ గా మారేందుకు సిద్ధపడ్డాడు. నేటి విచారణలో భాగంగా అతడు ముంబై దాడుల వెనుక పాక్ హస్తంపై పలు ఆసక్తికర అంశాలను కోర్టుకు చెప్పాడు.

  • Loading...

More Telugu News