: చంద్రబాబు ఇంటి వెనుక భారీ చోరీ... 15 రోజుల తర్వాత వెలుగుచూసిన వైనం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాత్కాలిక నివాసం వెనుక ఇటీవల భారీ చోరీ జరిగింది. అయితే 15 రోజులుగా అసలు ఈ వ్యవహారమే వెలుగుచూడలేదు. ఊహించని విధంగా నిన్న వెలుగుచూసిన ఈ ఘటన సీఎం నివాసం వద్ద భద్రత డొల్లతనాన్ని బయటపెట్టేసింది. వివరాల్లోకెళితే... పాలనా సౌలభ్యం కోసం చంద్రబాబు తన మకాంను హైదరాబాదు నుంచి విజయవాడకు మార్చుకున్నారు. నగర శివారులోని కృష్ణా కరకట్టపై నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ ను తన తాత్కాలిక నివాసంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు భద్రత దృష్ట్యా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాక రాత్రి వేళల్లో కూడా చీమ చిటుక్కుమన్నా కనపడేలా భారీ వెలుగునిచ్చే ఖరీదైన లైట్లు ఏర్పాటు చేశారు. ఇక జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇంతటి భద్రత ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ వెనకాల 15 రోజుల క్రితం దొంగలు రెచ్చిపోయారు. చంద్రబాబు భద్రత కోసం ఏర్పాటు చేసిన అత్యంత ఖరీదైన లైట్లను ఎత్తుకెళ్లారు. ఆ మరునాడే విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది... ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందోనన్న భయంతో కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని ఉండవల్లి పంచాయతీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే అంత విలువైన లైట్లు కొనుగోలు చేసే స్తోమత తమ వద్ద లేదని ఉండవల్లి పంచాయతీ చేతులెత్తేసినా, భద్రతా అధికారులు మరింత ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో కొత్త లైట్లు కొనలేక ఉండవల్లి పంచాయతీ... అద్దె ప్రాతిపదికన లైట్లను తీసుకొచ్చి ఏర్పాటు చేసింది. అయితే అద్దె చెల్లింపులో మాత్రం ఆ పంచాయతీ విఫలమైంది. దీంతో నిన్న సదరు లైట్లను అద్దెకు ఇచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చి పట్టపగలే లైట్లను విప్పేందుకు ఉపక్రమించాడు. దీనిని గమనించిన పరిసర రైతులు అతడిని నిలదీయగా... ఆ లైట్లు తనవేనని, అద్దెకు తెచ్చిన పంచాయతీ డబ్బులు చెల్లించకపోవడంతో తీసుకుపోతున్నానని చెప్పాడట. అయినా సీఎం భద్రత కోసం అద్దెకు లైట్లు తీసుకురావాల్సిన అవసరమేమిటన్న కోణంలో రైతులు ఆరా తీయగా, చోరీ విషయం వెలుగుచూసింది.

  • Loading...

More Telugu News