: ముంబైపై రెండు సార్లు దాడికి యత్నించి విఫలం, మూడోసారి విజయం: కోర్టుకు తెలిపిన హెడ్లీ
ముంబైపై ఉగ్రదాడికి ముందు రెండు సార్లు అదే విధమైన దాడులకు ప్రయత్నించి విఫలమైనట్టు పాక్- అమెరికన్ డేవిడ్ హెడ్లీ ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపాడు. ఈ రెండు దాడులను కూడా లష్కరే తోయిబా ప్లాన్ చేసిందని, అయితే అనుకున్నట్టు జరగక చివరి నిమిషంలో రద్దు చేసుకుందని అప్రూవర్ గా మారిన హెడ్లీ వెల్లడించాడు. తొలి దాడికి సెప్టెంబర్ 2008లో ప్లాన్ జరిగిందని, ఓ బోటు ముంబై తీరానికి సమీపంలో రాళ్లను ఢీకొని ఆయుధాలను, పేలుడు సామాగ్రినీ కోల్పోయిందని, ఉగ్రవాదులు మాత్రం బతికిపోయారని వెల్లడించాడు. ఆపై అక్టోబరులో ఇదే విధమైన దాడికి ప్రయత్నం జరిగిందని చెప్పిన హెడ్లీ, అదెందుకు విఫలమైందో మాత్రం చెప్పలేదు. "లష్కరే తోయిబాకు నేను నిజమైన అభిమానిని. నేను ఇండియాకు తొలిసారి రాకముందే వారు చేయాలనుకుంటున్న దానిపై నాకు పూర్తి సమాచారం తెలుసు" అని హెడ్లీ కోర్టుకు వెల్లడించాడు. లష్కరే ప్రతినిధి సాజిద్ మీర్, తనను ఇండియాలో వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరాడని, ముంబై నగరం వీడియోను అడిగాడని కూడా కోర్టుకు చెప్పాడు. తాను వీడియోలు తీసి పంపానని, టెర్రరిస్టులు వాటిని వాడుకుని దాడులు చేశారని చెప్పాడు.