: మేమిచ్చే నిధులు ఏ మూలకు?: స్మార్ట్ సిటీలపై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
స్మార్ట్ సిటీ జాబితాలో చోటు చేసుకున్న నగరాల్లో అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదని, అసలు ఈ నగరాలకు తామిచ్చే నిధులు ఏ మూలకూ సరిపోవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులకు తోడు రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు విరివిగా వెచ్చిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. విశాఖలో అంతర్జాతీయ నావికాదళ సమీక్ష విజయవంతమైన సందర్భంగా ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆకర్షణీయ నగరాల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలిపిన ఆయన, ఈ విషయమై రాజకీయ ఆరోపణలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ జాబితాలోకి చేరేందుకు మరో అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుందని, నగరాల పోటీలో నిలిచి స్మార్ట్ సిటీల జాబితాలోకి చేరవచ్చని అన్నారు. అభివృద్ధిలో సహకరించేందుకు మాత్రమే కేంద్రం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఫ్లీట్ రివ్యూ తరువాత విశాఖకు మరింత అభివృద్ధి దిశగా మార్గం సుగమమైందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ, స్థిరాస్తి బిల్లులకు ఆమోదం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.