: నాకు తోచింది నేను మాట్లాడతా: రాయపాటి
కొన్ని కారణాల వల్లే తన నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లో కొనసాగాల్సి వచ్చిందని, ఏదైనా విషయంపై ఆ సందర్భంలో తనకు తోచింది తాను మాట్లాడతానని, అది తన మనస్తత్వమని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ‘క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని..2014 వరకు పోటీచేయనని గతంలో ప్రకటించారు, ఆ మాటపై ఎందుకు నిలబడలేదు?’ అనే ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ మొదలైన అంశాలపై గతంలో ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత నాలుక్కరచుకోవడం ఎందుకు? అనే ప్రశ్నకు రాయపాటి సమాధానమిస్తూ, రైల్వే జోన్ తమ ప్రాంతానికి వస్తేనే బాగుంటుందని, ఇక్కడ బంజరు భూములు ఎక్కువగా ఉన్నాయని, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. గత పదేళ్ల కాలంలో మాచర్ల, గురజాల, వినుకొండ వంటి ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని.. కాంగ్రెస్ పాలనలో ఆ ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని అన్నారు. ‘ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎంపీలకు, ముఖ్యమంత్రికి ఇబ్బంది కల్గించేలా మీరు ఎందుకు మాట్లాడతారు?’ అనే దానిపై ఆయన స్పందిస్తూ అటువంటిదేమీ లేదని.. ఎవరికీ తాను ఇబ్బంది కల్గించలేదని రాయపాటి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా తన నియోజకవర్గంలో మంచినీటి సౌకర్యం కల్గించలేకపోయానన్న బాధతోనే గతంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమేనని అన్నారు.