: అరకు కాఫీకి మోదీ ఫిదా!... మన్యం కాఫీ రుచికి మైమరచిన ప్రధాని


నవ్యాంధ్ర ఎకనమికల్ కేపిటల్ విశాఖ పరిధిలోని మన్యంలో గిరిజన రైతులు పండిస్తున్న ‘అరకు కాఫీ’కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైమరచిపోయారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను తిలకించేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా నిన్న ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మారిటైమ్ ఎగ్జిబిషన్, ఐఎఫ్ఆర్ విలేజ్ ను ప్రధాని సందర్శించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడులతో కలిసి వచ్చిన మోదీ... అరకు కాఫీ స్టాల్ వద్ద కాసేపు ఆగారు. ఈ సందర్భంగా మోదీ, నరసింహన్, చంద్రబాబులకు స్టాల్ నిర్వాహకులు అరకు కాఫీని అందించారు. సదరు కాఫీని సిప్ చేసిన మోదీ ఆ రుచికి మైమరచిపోయారు. ‘‘చాలా బాగుంది. ఈ కాఫీ పండే ప్రాంతం ఎక్కడ ఉంది? దీని రుచి ఇతర ప్రాంతాల వారికి తెలుసా? పంట ఎవరు పండిస్తున్నారు?’’ అని మోదీ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన చంద్రబాబు మన్యం రైతులే అరకు కాఫీని పండిస్తున్నారని, దీనిని ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని వివరించారు. అరకు కాఫీ రుచికి మైమరచిన ప్రధాని మోదీ ఏకంగా 20 నిమిషాల పాటు ఆ స్టాల్ వద్దే నిలిచిపోయారు.

  • Loading...

More Telugu News