: ఏకంగా మంత్రినే వెలివేశారు...మద్దతిచ్చిన వారినీ వదల్లేదు!


కుల, మతాలకతీతంగా జీవించాలని వేదికలెక్కిన ప్రతి ఒక్కరూ ప్రసంగాలతో రక్తికట్టిస్తారు. కానీ భారత దేశంలో కులం పట్టింపులు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఒడిశాలో జరిగిన ఓ సంఘటన నిరూపించింది. జనవరి 31న బిజూ జనతాదళ్ కు చెందిన ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ, యూత్ సర్వీసెస్, క్రీడల శాఖా మంత్రి సుధమ్ మరాండీ తన కుమార్తె డాక్టరైన సంజీవనిని, బిజూ జనతాదళ్ స్టూడెంట్ యూనియన్ లీడరైన బ్రాహ్మణ యువకుడు సునీల్ సరంగికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. గిరిజనుడైన సుధమ్ మరాండీ కులం కట్టుబాట్లు దాటాడని బంగ్రిపోసి పట్టణంలో సంతల్ తెగకు చెందిన కుల పెద్దలంతా సమావేశమయ్యారు. కులాంతర వివాహం జరిపి మంత్రి కట్టుబాట్లు మీరారని వారు నిర్ధారించారు. దీంతో మంత్రిని కులం నుంచి, ఊరి నుంచి వెలివేస్తున్నట్టు ప్రకటించారు. అంతటితో ఆగకుండా మంత్రికి మద్దతు ఇచ్చారనే కారణంతో మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ముగ్గురికి మంత్రికి విధించిన శిక్షే విధించారు. కాగా, దేశంలో మూడో అత్యధిక జనాభా కలిగిన గిరిజన తెగ సంతాల్. జార్ఖండ్, బెంగాల్, బీహార్, ఒడిశాలలో ఈ తెగ ప్రజలు అత్యధికంగా ఉంటారు. గతంలో మాజీ మంత్రి చైతన్య ప్రసాద్ మాంఝీ ఇద్దరు కుమార్తెలు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు మరాండీ నానాయాగీ చేశారు. ఆయనను కులం నుంచి, ఊరి నుంచి బహిష్కరించే వరకు వదల్లేదు. కులాంత వివాహాలను సంతాల్ తెగ అంగీకరించదని రోమాంఛిత ప్రసంగాలు గుప్పించారు. తాజాగా ఆయన అదే ఉచ్చులో ఇరుక్కున్నారు.

  • Loading...

More Telugu News