: మున్సిపల్ మంత్రిగా ప్రజల ప్రాధాన్యతలు సమీక్షిస్తాను: కేటీఆర్
మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రజల ప్రాధాన్యతల వారీగా పనులను సమీక్షిస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో ఉన్న 24 సర్కిల్స్ లో టౌన్ హాల్ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తామని ఆయన తెలిపారు. 15 రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు వచ్చేలా రూపకల్పన చేశామని చెప్పిన ఆయన, ఆ లోగా అనుమతులు రాని పక్షంలో, సదరు పనికి అనుమతి లభించినట్టు భావించాలని ఆయన సూచించారు. అనుమతినివ్వడంలో అలసత్వం ప్రదర్శించిన అధికారికి జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం సాధిస్తే తన దగ్గరున్న మున్సిపల్ శాఖను కేటీఆర్ కు ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో మున్సిపల్ శాఖను కేటీఆర్ కు కేసీఆర్ కట్టబెడుతున్నట్టు తెలుస్తోంది.