: పురపాలనను సమూలంగా మార్చాల్సిన బాధ్యత ఉంది: కేటీఆర్
పురపాలన అంటే అదేదో ప్రజలకు సంబంధం లేని వ్యవహారంలా నడిచిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, పురపాలన ప్రజలకు అందనంత దూరంలో ఉందని అన్నారు. ఇకపై అలా ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాదులో ఉన్న 34 వేల కాలనీ సంఘాలను పురపాలనలో భాగస్వాములను చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలను పురపాలనలో భాగస్వాములను చేస్తూ గ్రేటర్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పనితీరును మారుస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాదు శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్కరితో తాను సమావేశం కావాలని భావిస్తున్నానని ఆయన తెలిపారు.