: నిలకడగా ముద్రగడ ఆరోగ్యం... క్రమంగా క్షీణిస్తున్న ముద్రగడ సతీమణి ఆరోగ్యం
కాపులకు రిజర్వేషన్లే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయానికి సంబంధించి ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఆరోపిస్తూ ముద్రగడ తన సతీమణితో కలిసి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో నిన్న దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పంపిన ప్రతినిధులతో రెండుసార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో ముద్రగడ దీక్ష ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఈ క్రమంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటి తలుపులు బిగించుకుని లోపల నిద్రపోయిన ముద్రగడ దంపతులు నేటి ఉదయం నుంచి మళ్లీ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ముద్రగడతో పాటు ఆయన సతీమణికి కూడా వైద్యులు పరీక్షలు చేశారు. ముద్రగడ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఆయన సతీమణి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు ఈ పరీక్షల్లో తేలింది. దీంతో కిర్లంపూడిలో ముద్రగడ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.