: బీహార్ లో రాజకీయ హత్య?...తేజస్వీపై ఓడిన ఎల్జేపీ అభ్యర్థి తండ్రిపై బుల్లెట్ల వర్షం
బీహార్ లో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. ఇప్పటికే పలువురు ఇంజినీర్ల హత్యలతో ఆ రాష్ట్రంలోకి గతంలోని గూండారాజ్ ప్రవేశించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడచిన రెండు టెర్మ్ లలో గూండారాజ్ ను కూకటివేళ్లతో పెకలించిన ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్, మూడో దఫా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కారు. ఈ దఫా నితీశ్ కుమార్ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఆ రాష్ట్రంలో నేరగాళ్లు రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నిన్న రఘోపూర్ లో గుర్తు తెలియని రౌడీ మూకలు తుపాకులతో స్వైర విహారం చేశారు. లాలూ పుత్రరత్నం తేజస్వీ యాదవ్ పై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లోక్ జనశక్తి పార్టీ నేత రాకేశ్ తండ్రి, ఆ పార్టీ కీలక నేత బైజ్ నాథీ సింగ్ ను రౌడీలు కాల్చి చంపారు. పాట్నా నుంచి రఘోపూర్ బయలుదేరిన సింగ్ పై రఘోపూర్ సమీపంలో రౌడీలు విరుచుకుపడ్డారు. భార్య, కుమారుడు, మరో మహిళతో కలిసి ప్రయాణిస్తున్న సింగ్ స్కార్పియోను అడ్డగించిన రౌడీలు ఏకే-47 తుపాకీతో ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారు. దాదాపు 30 రౌండ్లకు పైగా కాల్పులు జరపగా, 15 బుల్లెట్లు సింగ్ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఈ దాడిలో సింగ్ భార్య సహా మరో మహిళ కూడా గాయపడగా, రాకేశ్ కు మాత్రం గాయాలు కాలేదు. దుండగుల కాల్పుల్లో గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలించేలోగానే సింగ్ చనిపోగా, ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.