: ప్రతిభ చాటిన వెల్డర్ కొడుకు!...రూ.1.02 కోట్ల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్ కొలువుకు ఎంపిక


అతడి తండ్రి చేసేది విరిగిపోయిన ఇనుము ముక్కలను అతికించే పని. అదేనండి ‘వెల్డర్’ పని. అయితేనేం, అతడు ఏమాత్రం నిరాశ చెందలేదు. అతడు చదువుల తల్లినే నమ్ముకున్నాడు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో సీటు సాధించేశాడు. అంతేకాదు, ఇంకా చదువు పూర్తి కాకుండానే ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో ‘కోటి’ వేతనంతో కొలువు కూడా కొట్టేశాడు. ప్రస్తుతం విద్యాభ్యాసంలో చివరి దశలో ఉన్న అతడు, ఈ ఏడాది అక్టోబర్ లో నేరుగా మైక్రోసాఫ్ట్ కేంపస్ లో సగర్వంగా అడుగు పెట్టనున్నాడు. అయినా అతడెవరో పేరూ, ఊరు చెప్పలేదు కదూ. గూండారాజ్ రాజ్యమేలుతున్న బీహార్ లోని ఖగారియాలో వెల్డర్ వృత్తితో కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్న చంద్రకాంత్ సింగ్ చౌహాన్ తన కుమారుడు వత్సలిసా సింగ్ చౌహాన్ ను బాగా చదివించాలనుకున్నాడు. వత్సలిసాకు కూడా చదువు బాగానే అబ్బింది. తన గురువు చెప్పిన మేరకు ఇంజినీరింగ్ అంటే మక్కువ పెంచుకున్న ఆ కుర్రాడు ఖరగ్ పూర్ ఐఐటీలో సీటే లక్ష్యంగా పట్టు వదలని విక్రమార్కుడే అయ్యాడు. తొలి యత్నంలో నిరాశే ఎదురైనా మొక్కవోని దీక్షతో రెండోసారి సత్తా చాటాడు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 382వ ర్యాంకు సాధించాడు. నేరుగా ఖరగ్ పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ లో సీటు సాధించిన అతడు ఇంజినీరింగ్ లోనూ సత్తా చాటాడు. గత డిసెంబర్ లో జరిగిన కేంపస్ ఇంటర్వ్యూల్లో అతడి ప్రతిభకు మైక్రోసాఫ్ట్ ఫిదా అయిపోయింది. ఏడాదికి రూ.1.02 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది. ప్రపంచ సాప్ట్ వేర్ దిగ్గజం చేసిన బంపరాఫర్ కు సరేనన్న వత్సలిసా, తన చదువు పూర్తి కాగానే ఈ అక్టోబర్ లో కొలువులో చేరనున్నాడు.

  • Loading...

More Telugu News