: వకీలుగా పి.చిదంబరం...జగన్ కేసులో పునీత్ దాల్మియా తరఫున వాదనలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వకీలు అవతారం ఎత్తారు. రాజకీయాల్లోకి రాకముందు చిదంబరం న్యాయవాదిగా కొంతకాలం పాటు ప్రాక్టీసు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంబంధిత నేరాల్లో ఆయన పేరొందిన న్యాయవాదిగా కీర్తిగాంచారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత న్యాయవాద వృత్తిని దాదాపుగా వదిలేసిన ఆయన సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చాలా సార్లు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తాజాగా నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో జగన్ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. జగన్ తరఫున చిదంబరం నేరుగా వకాల్తా పుచ్చుకోలేదు గాని, జగన్ కంపెనీల్లో లోపాయికారిగా పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సిమెంట్ కింగ్ పునీత్ దాల్మియా తరఫున ఆయన బరిలోకి దిగారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత విచారణకు రమ్మంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తన క్లయింట్ ను ఎలా పిలుస్తారంటూ చిదంబరం చేసిన వాదనకు హైకోర్టు ఆలోచనలో పడింది. చిదంబరం వాదన సరైనదేని భావించిన హైకోర్టు... దీనికి వివరణ ఇస్తూ వాదనలు వినిపించాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.