: రెండో రోజుకు ముద్రగడ దీక్ష... ప్రభుత్వ దూతగా చర్చల కోసం కిర్లంపూడికి నేడు కేఈ
కాపులకు రిజర్వేషన్ల కోసం సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి రెండో రోజుకు చేరుకుంది. నిన్న ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో సతీసమేతంగా దీక్షకు దిగిన ముద్రగడ, కాపులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ముద్రగడ దీక్షకు దిగకుండా నిలువరించేందుకు మొన్న రాత్రి టీడీపీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే నిన్న విశాఖలో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించారు. ముద్రగడ డిమాండ్లు, ప్రభుత్వ చర్యలు, ముద్రగడ దీక్షను విరమించేలా అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు సమీక్షించారు. చర్చల్లో భాగంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి... ముద్రగడతో చర్చలు జరపాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో నేడు కేఈ నేరుగా కిర్లంపూడి వెళ్లి ముద్రగడతో చర్చలు జరపనున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూనే, భవిష్యత్తులో చేపట్టనున్న చర్యలను ఆయన ముద్రగడకు వివరించనున్నారు.