: హైదరాబాదీలు కేసీఆర్ తోనే ఉంటామని చెప్పారు: కేసీఆర్
హైదరాబాదీలు కేసీఆర్ తోనే ఉంటామని స్పష్టం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ విజయం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న మొన్నటి వరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని అన్నారు. హైదరాబాదులో పెద్ద రిజర్వాయర్లు రెండు ఏర్పాటు చేసి మంచి నీటి సమస్య అన్నది లేకుండా చేస్తామని ఆయన చెప్పారు. అలాగే హైదరాబాదులో కనురెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. స్కైవేలు, మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, నీటి సమస్యలు లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. కింగ్ కోఠీ ఆసుపత్రిని వెయ్యి పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతూ, మరో రెండు వెయ్యి పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒకటి, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో మరొక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఆసుపత్రుల్లో అపోలో, యశోద, కిమ్స్ వంటి ఆసుపత్రుల్లో ఉండే సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఏడాది కాలంలో ఈ ఆసుపత్రులు నిర్మిస్తామని ఆయన తెలిపారు.