: ట్రైన్లు, కార్లను తగలబెడితే ఇక వారిని బీసీలుగా గుర్తిస్తారా?: చంద్రబాబుకు కృష్ణయ్య సూటి ప్రశ్న


ట్రైన్లు, కార్లను తగలబెడితే బీసీలుగా గుర్తిస్తారా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య సూటిగా ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వాలు భయపడడం మొదలు పెడితే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 9ను సవరిస్తామని చంద్రబాబునాయుడు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, అలా సవరణ చేయగలిగితే, ఇప్పుడు బీసీలకు అందుతున్న 25 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలంటూ సవరణలో పేర్కొనాలని ఆయన సూచించారు. గతంలో శాసనసభలో నాలుగు సార్లు చేపట్టిన చర్చలు, ఏకవాక్య తీర్మానాలను అమలు చేసేలా ఆ చట్టసవరణలో పేర్కొనాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీలంతా తిరగబడే రోజును ప్రభుత్వాలు చూస్తాయని ఆయన హెచ్చరించారు. అవకాశవాద రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాపు సోదరుల ఉన్నతికి వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇస్తే కాదనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆర్ధిక అసమానతలను రూపుమాపేందుకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టలేదన్న విషయాన్ని రాజకీయ నాయకులంతా గుర్తించాలని ఆయన సూచించారు. లేదు ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే రిజర్వేషన్లు వచ్చాయని నిరూపించేందుకు రాజకీయ నాయకులు సిధ్దమైతే నిరూపించి, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News