: ఆ హెల్ప్ లైన్ నెంబరు అందుకోసం కాదు: చైల్డ్ లైన్ ఇండియా
భారతదేశంలో పేద పిల్లలకు అదనపు ఆహారాన్ని అందించేందుకుగాను ‘డయల్ 1098’ అంటూ వస్తున్న మెస్సేజ్ లను నమ్మవద్దని చైల్డ్ లైన్ ఇండియా హెచ్చరిస్తోంది. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో ‘డయల్ 1098’ అనే సందేశాలను విరివిగా పంపుతున్నారని... ముఖ్యంగా వాట్సప్ లో ఈ మెస్సేజ్ ఎక్కువగా చక్కర్లు కొడుతోందని పేర్కొంది. పేదపిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ మెస్సేజ్ ఉండటంతో నెటిజన్లు భారీగా స్పందించారని పేర్కొన్న చైల్డ్ లైన్ ఇండియా ప్రతినిధులు మరో విషయాన్ని కూడా పేర్కొన్నారు. ఇటువంటి పథకం ఏమీ లేదని.. ‘డయల్ 1098’ అనేది కేవలం చిన్నారుల భద్రత, రక్షణ కోసమే ఏర్పాటైందని చెప్పారు. పిల్లల హక్కులను కాపాడే ప్రముఖ ఎన్జీవో సంస్థ ఒకటి 1996లో ప్రారంభమైనప్పటి నుంచీ వీధి బాలల కోసం ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసిందని చెప్పారు. తాము ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం గానీ, పంపిణీ చేయడం గానీ చేయమని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చైల్డ్ లైన్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు.