: విమానంలో సోను నిగమ్ గాత్ర కచేరి... ఉద్యోగులపై జెట్ ఎయిర్ వేస్ చర్యలు
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అనే మాటను తరచూ వింటుంటాం. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల జోద్ పూర్ నుంచి ముంబై వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ ప్రయాణించారు. ఎన్నోవేల పాటలతో ప్రేక్షకులను అలరించిన ఆయనను ప్రయాణికులంతా పాటలు పాడాలని కోరగా, పలు పాటలు పాడి సోను వారిని సంతోషపరిచాడు. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు ఫోటోలు, వీడియో తీశారు. వారిలో ఎవరో సోను పాడుతుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అది వైరల్ అయి హల్ చల్ చేస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా, కొన్నిరోజులకు అసలు విషయం జెట్ ఎయిర్ వేస్ సంస్థకు తెలియడంతో సీరియస్ అయింది. ఎయిర్ హోస్టెస్ తో పాటు విమాన క్యాబిన్ సిబ్బందికి చెందిన ఐదుగురిని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. ఇంకోసారి ఇలా చేస్తే ఉద్యోగాల నుంచి తీసి వేస్తామని హెచ్చరించింది. అయితే సస్పెండ్ చేసిన వారికి క్రమశిక్షణా చర్యల కింద మళ్లీ ట్రైనింగ్ ఇస్తారట.