: ఇక స్నాప్ డీల్ వంతు!... బ్రాండ్ అంబాసిడర్ గా ఆమీర్ ను కొనసాగించేందుకు ససేమిరా!
దేశంలో అసహనం పెరుగుతున్న వైనంపై నోరు జారిన బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కు తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ హోదాను అతడు కోల్పోయాడు. తన తాజా చిత్రం ‘దంగల్’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈ-కామర్స్ దిగ్గజం ‘స్నాప్ డీల్’ అతడికి భారీ షాక్ ఇవ్వనుంది. స్నాప్ డీల్ కు ఆమిర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా స్నాప్ డీల్, ఆమిర్ మధ్య కుదిరిన ఒప్పందం త్వరలోనే ముగియనుంది. అయితే రెండో దఫా ఆమిర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించేందుకు స్నాప్ డీల్ సిద్ధంగా లేదు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ సంచలన కథనం రాసింది. ఆమిర్ తో కాంట్రాక్టును పొడిగించుకునేందుకు స్నాప్ డీల్ సిద్ధంగా లేదని ఆ సంస్థ ప్రతినిధులను ఊటంకిస్తూ ఆ పత్రిక ఈ కథనాన్ని రాసింది.