: నా ప్రాణం నా జాతికే అంకితం!... ఆమరణ దీక్షను ప్రారంభించిన ముద్రగడ
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే ఆయన సతీసమేతంగా దీక్షను ప్రారంభించారు. దీక్షకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ప్రాణం నా జాతికే అంకితం. కాపులకు రిజర్వేషన్లు దక్కేదాకా నా పోరాటం ఆగదు. నా దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరు కిర్లంపూడి రావద్దు. మీ ఇళ్లల్లోనే సంఘీభావంగా మధ్యాహ్నం భోజనం మానండి. ప్లేటుపై గరిటెతో కొట్టండి. ఆ శబ్దం సీఎం చెవిలో పడాలి. ఆ శబ్దం విని అయినా సీఎం మనకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. తుని ఘటనలో కాపులపై నమోదైన కేసులను పోలీసులు బేషరతుగా ఎత్తివేయాలి. నాకు పోలీసుల రక్షణ అవసరం లేదు. పోలీసులు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. శాంతియుత, గాంధేయ మార్గంలోనే దీక్షకు దిగుతున్నా’’ అని ముద్రగడ భావోద్వేగంతో మాట్లాడారు.