: చంద్రబాబు సమీక్షలు... అధికారులను అనారోగ్యానికి గురి చేస్తున్న వైనం!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విధి నిర్వహణలో చండశాసనుడే. ప్రజా సంక్షేమం కోసం తాను అలుపెరగకుండా పనిచేయడమే కాక అధికారులను కూడా ఆయన ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సుదీర్ఘ సమీక్షలు, వేళాపాళా లేని భేటీలు నిర్వహిస్తూ చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు చంద్రబాబు సమీక్షలతో తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు, అనారోగ్యం బారిన కూడా పడుతున్నారట. అర్ధరాత్రి దాకా సమీక్షలు నిర్వహిస్తే, అనారోగ్యానికి గురి కాక ఎలా తప్పించుకుంటామంటూ అధికారులు లోలోపలే మధనపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా ఈ తరహా ఘటన ఒకటి చోటుచేసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ భేటీ తర్వాత సాయంత్రం 4 గంటలకు జరగనున్న సమీక్షకు రావాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో కాస్తంత ముందుగానే విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఆ శాఖ అధికారులు చేరుకున్నారు. రాత్రి 7 గంటల దాకా కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాత మీడియా సమావేశం పేరిట చంద్రబాబు 45 నిమిషాలు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో రాత్రి 9.20 గంటలకు సమీక్ష ప్రారంభమైంది. కేబినెట్ భేటీ, మీడియా సమావేశం జరుగుతున్నంతసేపు ఏదైనా తిని వద్దామంటే, సీఎం వస్తే ఎలాగన్న భావనతో అధికారులంతా అక్కడే వేచి చూశారు. ఇక 9.20 గంటలకు మొదలైన సమీక్షా సమావేశం రాత్రి 12 గంటల దాకా కొనసాగింది. ఈ క్రమంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు అధికారులు నీరసించిపోయారు. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది సమీపంలో ఉన్న ఓ డాక్టర్ ను పిలవగా, భోజనం చేయని కారణంగానే షుగర్ లెవెల్స్ పడిపోయాయని తేలింది. అంతేకాక ఏదైనా తింటే కాని, ఇంజెక్షన్ వేయలేమని డాక్టర్ చెప్పడంతో అక్కడ అందుబాటులో ఉన్న కొంత స్వీటును ఆ అధికారులకు తినిపించారు. ఆ తర్వాతే డాక్టర్ వారికి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక సమీక్ష ముగిసిన తర్వాత అధికారులంతా బయటకు వచ్చి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూడగా, ఏమీ లభించలేదు. దీంతో రోడ్ సైడ్ లో తోపుడు బండ్లపై లభించే ఇడ్లీ, దోసెలతో వారు తమ కడుపు నింపుకున్నారట.

  • Loading...

More Telugu News