: ‘ట్రబుల్ షూటర్’ దౌత్యం విఫలం... మరికాసేపట్లో ముద్రగడ దీక్ష
కాపులకు రిజర్వేషన్ల కోసం సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరికాసేపట్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని తన సొంతూరు కిర్లంపూడిలో సొంతింటిలోనే ఆయన సతీసమేతంగా దీక్షకు దిగనున్నారు. ముద్రగడ దీక్షకు దిగకుండా ఉండేలా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నెరపిన దౌత్యం ఫలించలేదు. ట్రబుల్ షూటర్ గా పేరున్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మరో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావులు నిన్న రాత్రి ముద్రగడతో దాదాపు రెండు గంటల పాటు జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలోనే జరిగినా, ప్రభుత్వ ప్రతిపాదనకు ముద్రగడ ససేమిరా అన్నారు. కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ కు రూ.2 వేల కోట్ల విడుదల తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే, తాను దీక్ష విరమిస్తానని ముద్రగడ తోట బృందానికి తేల్చిచెప్పారు. ఈ క్రమంలో సదరు అంశాలను సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించి నేటి ఉదయం మరోమారు కలుస్తామంటూ తోట త్రిమూర్తులు ముద్రగడ ఇంటి నుంచి బయలుదేరారు. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించిన ముద్రగడ, ప్రభుత్వం నుంచి హామీ వచ్చేదాకా దీక్ష విరమించేది లేదని ప్రకటించారు.