: కారుతో ఢీకొట్టిన మహిళను కిడ్నాప్ చేసిన పాదచారి!
పాదచారిని కారుతో ఢీకొట్టిన మహిళను అదే వ్యక్తి కిడ్నాప్ చేసిన సంఘటన ముంబైలో పట్టపగలే చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... శిల్పా వర్మ(40), నూపుర్ కుమారి శ్రీవాస్తవ(50) కుటుంబాలు గత ఇరవై ఏళ్లుగా ఒకరికొకరు బాగా తెలుసు. శిల్పా, నూపుర్ ల భర్తలు సహోద్యోగులు. మంగళవారం రాత్రి వీరంతా శిల్పావర్మ ఇంట్లో గడిపారు. మర్నాడు మధ్యాహ్నం శిల్పా, నూపుర్ లు కారులో గ్లోబల్ సిటీకి వెళ్తున్నారు. కారు నడుపుతున్న శిల్పా, గోకుల్ సిటీకి సమీపంలో ఒక పాదచారిని ఢీకొట్టింది. దీంతో ఆగ్రహించిన సదరు పాదచారి డోర్లు తెరవమంటూ కారుపై కొడుతూ కేకలు వేశాడు. కారు డోరు తీయగానే బాధితుడు వెనుక సీట్లో కూర్చుని పిస్టల్ బయటకు తీసి.. కారు పోనివ్వమంటూ శిల్పను బెదిరించాడు. సుమారు గంటన్నర పాటు ప్రయాణం చేసిన తర్వాత డోంగర్ పడ ప్రాంతానికి వెళ్లారు. మార్గమధ్యంలో ఒక స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో టైరు పంక్చరైంది. అదే అదనుగా భావించి, ఆ సమయంలో శిల్ప, నూపుర్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి యత్నించగా... ఆ వ్యక్తి శిల్ప చేతిని పట్టుకుని, ఆమెను కారు దిగనివ్వలేదు. నూపుర్ నుంచి పర్సు, బ్యాగ్ ను లాక్కున్నాడు. నూపుర్ కూడా వారి వెంట వెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని నూపుర్ తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడి కోసం ఏభై మంది పోలీసు సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.