: శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళ ప్రసవం కోసం గుజరాత్ హైకోర్టు తాత్కాలిక బెయిల్


అన్న భార్యను అత్మహత్యకు ప్రేరేపించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న భావనా ప్రజాపతి అనే మహిళ పట్ల గుజరాత్ హైకోర్టు దయచూపింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ఆమెకు ప్రసవం కోసం 11 నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ప్రసవం తరువాత బిడ్డ సహా ఈ ఏడాది డిసెంబర్ 31న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రూ.10వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. తనకు మానవతా దృక్పథంతో శిక్షా కాలాన్ని తగ్గించాలంటూ భావన పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కె సయీద్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. అయితే ఆ మహిళ తిరిగి వచ్చిన తరువాత ఆమె రెండేళ్ల మొదటి కుమార్తె సహా పుట్టిన బిడ్డ ఉండేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు సూచించింది. కోర్టు నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేసిన భావన, తన బిడ్డలు కూడా శిక్ష అనుభవించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నేళ్ల కిందట అన్న భార్య జల్పా ప్రజాపతి ఆత్మహత్య కేసులో ఆమెతో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను దోషులుగా తేల్చిన సెషన్స్ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైకోర్టుకు వెళ్లినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.

  • Loading...

More Telugu News