: బహిరంగ వేదికపై టెలికం మంత్రిని కఠిన ప్రశ్నలడిగిన భారత శక్తిమంత మహిళ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఆ బ్యాంకుకు చీఫ్ అరుంధతీ భట్టాచార్య. భారత్ లోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఆమె ఒకరు. అటువంటి భట్టాచార్య, టెలికం మంత్రిని ఓ బహిరంగ వేదికపై సూటిగా, సరైన సమాధానం చెప్పలేని ప్రశ్నలడిగారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎన్డీటీవీ అవార్డుల్లో భాగంగా 'బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం భట్టాచార్యకు దక్కింది. అవార్డును అందించేందుకు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ వేదికపైకి వచ్చారు. ఆమెకు అవార్డును అందించిన తరువాత "ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కేంద్రాన్ని ప్రశ్నించే స్వాతంత్రం లేదన్న అభిప్రాయం ఉంది. మీకేవైనా ప్రశ్నలుంటే నిస్సంకోచంగా అడగండి" అన్నారు. దీంతో, ఆయన ఆహ్వానానికి స్పందించిన అరుంధతీ భట్టాచార్య, టెలికం రంగానికి చెందిన ప్రశ్నలనే అడిగారు. ఇండియాలో రేడియో తరంగాలకు అత్యధిక రేటు పలుకుతున్నందున, ఆదాయం పెంచుకోవడంపైనే టెలికం సంస్థలు దృష్టిని పెడుతున్నాయని, దీంతో మౌలిక వసతుల కొరత ఏర్పడి వృద్ధి మందగించిందని ప్రస్తావించారు. "మేము పర్యటించిన దేశాల్లో టెలికం విభాగంలో మౌలిక వసతులు పూర్తి ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో ఉన్నాయి. అక్కడ లైసెన్స్ ఫీజులు చాలా తక్కువగా ఉండటంతో, వారు టవర్లు తదితర సౌకర్యాల కల్పనకు నిధులు వెచ్చించగలుగుతున్నారు. ఇండియాలో అలా ఎందుకు చేయలేరు?" అన్నారు. ఆమె వాదనతో ఏకీభవించని రవి శంకర్, సహజ వనరుల వేలం విషయమై సుప్రీం మార్గదర్శకాలను అమలు చేయాల్సి వుందన్నారు. టెలికం రంగంలో ఇప్పటికీ ఇండియాలో పోటీ పెరగలేదని చెప్పారు. ఆయన సమాధానం నచ్చని భట్టాచార్య, "ప్రభుత్వం ఖజానాకు ఆదాయాన్ని తగ్గించుకుంటే టెలికం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెరిగి ఆర్థిక వృద్ధి కంటిముందు కనిపిస్తుంది" అన్నారు. మరో ప్రశ్న అడుగుతూ, "ఇండియాలో కాల్ రేట్స్ ఎక్కడికి పోతున్నాయి?" అని ప్రశ్నించగా, దానికి కూడా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. మార్కెట్ లో జరిగే మార్పుల ఆధారంగా రేట్లు మారుతుంటాయి అనేసి తప్పించుకున్నారు మన టెలికం మంత్రి వర్యులు.