: ఆ ఒక్క పనీ చేస్తే, పాకిస్థాన్ కు పూర్తి బాసట: రాజ్ నాథ్ సింగ్
అన్ని విషయాల్లో పొరుగున ఉన్న పాక్ కు బాసటగా నిలిచేందుకు ఇండియా సిద్ధమని, అయితే, అంతకన్నా ముందు తమ దేశంలో వేళ్లూనుకున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లో జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, దక్షిణాసియా రీజియన్ లో రెండు ముఖ్య దేశాలుగా ఉన్న భారత్, పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలంటే, ఉగ్రవాదం తొలగిపోవాలని ఆయన అన్నారు. ఇండియాలో జరిగే ఉగ్రవాద దాడులన్నీ పాక్ సంస్థల ప్రేరేపితమేనని వెల్లడించిన ఆయన, పాక్ నేతలు సిన్సియర్ గా చర్యలు తీసుకుంటున్న సంకేతాలను పంపడంలో విఫలమవుతున్నారని అన్నారు. ముంబైపై జరిగిన 26/11 దాడులు, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడుల వెనుక పాక్ కుట్ర దాగుందనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం రోజురోజుకూ పెను సవాలుగా మారుతోందని అభిప్రాయపడ్డ ఆయన, పాక్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటేనే ముష్కరుల కట్టడి సాధ్యమని అన్నారు.