: మీరు కెమెరాతో కొడితే నేనిప్పుడేం చేస్తా?: మీడియాతో తూ.గో ఎస్పీ రవిప్రకాష్


కాపు గర్జన అనంతరం జరిగిన విధ్వంసంపై విచారణ జరుగుతున్న తీరు, కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏర్పాట్ల గురించి మీడియా సమావేశం నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విధ్వంసాన్ని ముందే గుర్తించడంలో ఇంటెలిజన్స్ విఫలమైందని భావిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా, తాము అన్ని రకాలుగా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని, నిఘా వైఫల్యం లేదని అన్నారు. "మీరు ఇక్కడ కూర్చుకున్నారు. నన్ను కెమెరాతో కొట్టొచ్చు. మీరు కొడతారని నేను ముందుగా ప్రిపేర్ అయి రాలేదుగా? అక్కడా జరిగింది అదే. లక్షా, లక్షన్నర మంది ఒక చోట చేరిన సమయమది. వారంతా ఎటువైపు కదులుతారన్నది ఎవరూ ఊహించలేరు. సభ తరువాత ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లండని ఎవరు చెప్పినా, ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో. అప్పటికీ తుని పోలీసు స్టేషన్ ను కాపాడుకున్నాం. ఈ ఘటనల వెనుక నిఘా వర్గాల వైఫల్యం లేదు" అన్నారు. తాము అమాయకులను, ప్రజలను ఎవరినీ ఇబ్బంది పెట్టబోమని, పూర్తిగా సాక్ష్యాలు సేకరించిన తరువాతే అరెస్టులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీక్షల నేపథ్యంలో బయటివారిని కిర్లంపూడికి రానివ్వబోమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News