: 'నిద్రలేని రాత్రులు' గడుపుతున్న మోదీ సర్కారు: జైట్లీ


ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా ముందుందనడంలో సందేహం లేదు. కానీ, ఆర్థిక మంత్రి జైట్లీ అభిప్రాయం ప్రకారం, మోదీ ప్రభుత్వం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. "మన ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండుకు అనుగుణంగా పెరగడం లేదు. గడచిన రెండేళ్లుగా వ్యవసాయం కుంటుబడటంతో, పెట్టుబడులు మందగించాయి. సరైన స్థాయిలో రుతుపవనాలు లేక క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి" అని ఆయన అన్నారు. దేశంలో అంచనాలకు మించి స్థూలజాతీయోత్పత్తి పడిపోతున్న వేళ జైట్లీ ఈ తరహా కామెంట్లు చేయడం గమనార్హం. ఒకవైపు స్టాక్ మార్కెట్ల పతనం, మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలతో తగ్గిపోతున్న రూపాయి విలువ వృద్ధిని వెనక్కు లాగుతున్నాయని ఆయన అన్నారు. జనవరి 2008 తరువాత, ఓ నెలలో అత్యధికంగా ఎఫ్ఐఐలు రూ. 11 వేల కోట్లను భారత ఈక్విటీల నుంచి వెనక్కు తీసేసుకున్నాయని 'ఇన్వెస్ట్ కర్ణాటక 2016'లో ప్రసంగించిన ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లంతా ఇండియా వైపు చూస్తున్నారని, 2001, 2008 ఆపై 2015లో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యాల ప్రభావం భారత్ పై లేకపోవడమే ఇందుకు కారణమని జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే, దేశం ముందున్న సవాళ్లను ఐకమత్యంగా ఎదుర్కోవాల్సి వుందని, రాజకీయాలు వృద్ధి విఘాతాలుగా మారరాదని ఆయన అన్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వచ్చేందుకు మరింత ఆకర్షణీయంగా దేశం మారాలని, అందుకోసం అమలు చేయాల్సిన సంస్కరణల విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి వుందని వివరించారు.

  • Loading...

More Telugu News