: ఐపీఎల్ ని వీడే ప్రసక్తే లేదు: డివిలియర్స్
ఐపీఎల్ ను వీడే ప్రశ్నేలేదని సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్ లో కొనసాగేందుకు ఐపీఎల్ నుంచి డివిలియర్స్ తప్పుకోనున్నాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై డివిలియర్స్ మాట్లాడుతూ, తాను ఐపీఎల్ నుంచి తప్పుకునే ప్రశ్నేలేదని తెలిపాడు. ఐపీఎల్ వల్లే తన ఆటతీరు మెరుగుపడిందని ఏబీ అన్నాడు. గత ఎనిమిదేళ్లుగా ఐపీఎల్ తో అనుబంధం కొనసాగుతోందని, అది అలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశాడు. ఐపీఎల్ నుంచి తప్పుకోను కానీ, ఇతర ఫార్మాట్ల విషయంలో మాత్రం ఆలోచించి తగిన విశ్రాంతి తీసుకుంటానని ఏబీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లో విరామం లేకపోవడంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన పేర్కొన్నాడు. అదే సమయంలో కెరీర్ ఇచ్చిన ఐపీఎల్ వంటి సిరీస్ లలో ఆడాలని అంతా భావిస్తారని, దీంతో విశ్రాంతి అన్నది లేకుండా పోతోందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.