: అన్ని పక్షాలవారం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం... సెక్షన్ 8 అమలు చేయండి!: పొంగులేటి
హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను విపక్షాల నేతలు కలిసిన సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాదులో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. పాతబస్తీలోకి ఎందుకు వచ్చావని ఓ ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నాడని, ఆ ప్రాంతమేమైనా అతని జాగీరా? అతని తాతలు అతనికి రాసి ఇచ్చారా? అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు క్షీణించినప్పుడు సెక్షన్ 8 అమలు చేయాలని చట్టంలో పేర్కొన్నారని, 144 సెక్షన్ అమలులో ఉండగా ఓ ప్రజాప్రతినిధిపై హత్యాయత్నం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. దోషిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఎంపీ దౌర్జన్యంగా విడిపించుకుని వెళ్లడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు. పాతబస్తీలో ప్రజాస్వామ్యం అపహాస్యమైతే ప్రభుత్వం బెయిలబుల్, పెట్టీ కేసులు పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనందున, గవర్నర్ శాంతి భద్రతలను అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాతబస్తీలో జరిగిన ఘటనను తేలిగ్గా తీసుకుంటే హైదరాబాదులో మరిన్ని తీవ్రమైన ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ ను శాంతిభద్రతలు అదుపులోకి తీసుకోవాలని కోరామని ఆయన చెప్పారు. సెక్షన్ 8 అమలు చేయాలని కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయని ఆయన తెలిపారు.