: దీక్షపై ముద్రగడ పునరాలోచించాలి: తోట త్రిమూర్తులు
కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సూచించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు ఆందోళనలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. బీసీలను కాపుల్లో చేర్చడం ఇప్పటికిప్పుడు తేలిపోయే అంశం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన వివరించారు. అమాయకులపై కేసులు పెడితే ఊరుకోమని ఆయన సూచించారు. దోషులపై కేసులు పెట్టడం సరైనదేనని ఆయన తెలిపారు. ఇంత దుర్మార్గమైన విధ్వంసానికి కుట్ర చేసిన వారిని శిక్షించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. ఆ మీటింగ్ పెట్టుకున్నది తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకే తప్ప, విధ్వంసానికి కాదని ఆయన తెలిపారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఉద్యమనేతలకు కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రతిష్ఠలా కాకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో అయినా, ఉద్యమ నేతలతో అయినా మాట్లాడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.