: నిందితులని పొరపాటు పడి.. టాంజానియా మహిళపై దారుణం
ప్రమాదం చేసిందొకరైతే.. బెంగళూరు వాసుల ఆగ్రహానికి గురైంది మాత్రం ఒక విదేశీ విద్యార్థిని. మానవత్వం మరిచి, విచక్షణా రహితంగా ఆ విద్యార్థినిని క్షోభకు గురిచేసిన సంఘటన బెంగళూరులో గత ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు... సుమారు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సు గల హెసరఘట్ట నివాసిని ఆదివారం రాత్రి ఒక వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి ప్రాణాలు పోయాయి. దీంతో, ఢీ కొట్టిన వాహనం కోసం అక్కడ ఉన్నవారు వెదుకుతున్నారు. ఈ సంఘటన జరిగిన 30 నిమిషాల తర్వాత బెంగళూరులోని ఆచార్య కాలేజ్ లో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న టాంజానియా యువతి(21), తన మిత్రులతో కలిసి అక్కడికి కారులో వెళ్లింది. ఢీ కొట్టిన వాహనం ఆచూకీ తెలియకపోవడంతో ఆగ్రహంతో ఉన్న అల్లరిమూకలు ఈ కారుపై దాడికి పాల్పడ్డారు. ఆ యువతిని కారులో నుంచి బయటకు లాగి తీవ్రంగా గాయపరిచారు.. ఆమెను వివస్త్రను చేశారు. వారి కారును తగులబెట్టారు. అయితే, ఈ తతంగమంతా చూస్తున్న వారిలో ఒక వ్యక్తి తన టీ షర్ట్ ను టాంజానియా మహిళపై కప్పబోతుండగా అతన్ని కూడా చితకబాదారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో బీఎంటీసీ బస్సు రావడంతో దాంట్లోకి ఎక్కేందుకు బాధితురాలు యత్నించగా.. అందులోని ప్రయాణికులు ఆమెను కిందకు తోసేశారు. అనంతరం బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ విషయమై ఫిర్యాదు చేసింది. యాక్సిడెంట్ కు కారకుడైన డ్రైవర్ ను తీసుకువస్తేనే కేసు నమోదు చేసుకుంటామంటూ పోలీసులు చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఈ యాక్సిడెంట్ చేసింది తాను కాదని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఈ సంఘటనపై బెంగళూరులోని ఆఫ్రికన్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం చేసింది సూడాన్ కు చెందిన కారు డ్రైవరని అసోసియేషన్ పేర్కొంది.