: 250 సీట్లు, ఒకే ప్రయాణికురాలు, నలుగురు సేవకులు... చైనా విమానంలో లక్కీయెస్ట్ పాసింజర్!
విమానంలో ఒక్కరే వెళుతున్నారంటే... ఏ ప్రపంచ దేశాధినేతో, మరో బడా పారిశ్రామికవేత్తకోగాని అటువంటి అవకాశం లభించదు. అప్పుడు కూడా వారివెంట కొందరు సహాయకులు ఉంటారు. కానీ, ఈ చైనా అమ్మడు మాత్రం ఓ అరుదైన చాన్స్ కొట్టేసింది. చైనాలో నూతన సంవత్సరం వేళ, విమానాలు, రైళ్లు అత్యధిక రద్దీతో ఖాళీ లేకుండా ప్రయాణిస్తున్న వేళ, ఝాంగ్ అనే యువతి ఒక్కతే విమానంలో ప్రయాణించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు 250 మంది ప్రయాణికులతో సెంట్రల్ ఉహాన్ నుంచి గుయాంజూ కు వెళ్ళాల్సిన సీజడ్ 2833 విమానం మంచు కారణంగా ఆలస్యం అవుతుందన్న వార్త రావడంతో, దానికి టికెట్లు కొనుక్కున్న వారంతా ఇతర విమానాల్లో, రైళ్లలో టికెట్లు బుక్ చేయించుకుని వెళ్లిపోయారు. కానీ ఝాంగ్ మాత్రం ఆ పని చేయలేదు. ఆపై ఎంతో ఆలస్యంగా ఆ విమానం వచ్చింది. దానిలో టిక్కెట్టున్నది ఒక్క ఝాంగ్ కు మాత్రమే. ఈ ప్రయాణం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, నలుగురు ఫ్లయిట్ అటెండెంట్స్ నుంచి తానొక్కతే సేవలను అందుకున్నానని చెబుతూ, విమానంలో దిగిన సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇంకేం, ఆమె ఒక్కసారిగా పాప్యులర్ అయిపోయింది. ఎంతో అదృష్టవంతురాలివనీ, ఇదో అరుదైన అవకాశమని, ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో అత్యంత రద్దీ వేళ, ఇంకాస్త ఆలస్యంగా బయలుదేరి మరికొందరిని తీసుకు వెళ్లాల్సిన విమానం ఒక్కరి కోసం సర్వీసు నడిపి, ఎంతో ఇంధనాన్ని వృథా చేసిందన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఏదైతేనేం, ఝాంగ్ లక్కీయే కదా?!