: గుజరాత్ లో అపర భగీరథుడు... నీటి కోసం నదిని తవ్విస్తున్న వజ్రాల వ్యాపారి!
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్ రాష్ట్రంలో ఎప్పుడూ కరవుతో అల్లాడిపోయే సౌరాష్ట్ర రీజియన్ రైతులను ఆదుకోవాలని భావించిన ఓ వజ్రాల వ్యాపారి మూడు నెలల నుంచి రహస్యంగా పనులు జరిపిస్తూ ఓ నదిని తవ్వుతున్నాడట. సూరత్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తూ, పేరు తెచ్చుకున్న జీరంభాయ్ థేసియా అనే వ్యాపారి, తన స్వగ్రామమైన అమ్రెల్లీ ప్రాంతంలో ఈ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టాడు. "నేనో రైతు కుమారుడిని. చిన్నప్పటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా దొరక్క మా గ్రామస్థులు పడ్డ అవస్థలను చూశాను. ఆనాడే నేను డబ్బు సంపాదించాలని, నా గ్రామానికి ఏదైనా చేయాలని అనుకున్నా. ఇప్పుడు నాదగ్గర అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ సంఘానికి ఇస్తాను. నా చివరి ఊపిరి వరకూ రైతుల కోసం పని చేస్తా. నది తవ్వకంలో పనిచేస్తున్న కార్మికులకు కావాల్సిన ఆహారాన్ని నా భార్యే స్వయంగా సమకూరుస్తోంది" అని 'నవ్ గుజరాత్ సమయ్' పత్రికకు జీరంభాయ్ తెలిపారు. మొత్తం 8 కిలోమీటర్ల దూరం పాటు 'తేబీ' నదిని తవ్వాల్సి వుందని, ఇప్పటివరకూ పావు భాగం పని పూర్తయిందని వివరించారు. ఈ నదిపై ఓ ఆనకట్ట నిర్మించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండానే పనులు జరుగుతున్నాయని వివరించారు. తన ప్రాజెక్టు పూర్తయితే, వచ్చే 500 ఏళ్ల వరకూ ఈ ప్రాంతంలో నీటికి కొరత ఉండదని, అన్ని సీజన్లలో రైతులు పంటలు పండించుకోవచ్చని, ఈ ప్రాంతం నందనవనంగా మారుతుందని అంటున్నారు. ఆల్ ది బెస్ట్ జీరంభాయ్!