: కర్ణాటకలో ‘గబ్బర్ సింగ్’ పోలీస్ స్టేషన్... నిందితులతో అర్ధనగ్న డ్యాన్సులు చేయించిన ఖాకీలు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు అధికారి పాత్రలో కనిపించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం గుర్తుందిగా. తనదైన కామెడీని పండించిన పవర్ స్టార్ ఆ చిత్రాన్ని జనరంజకం చేశారు. పోలీస్ స్టేషన్ లో చిత్రీకరించిన కామెడీ సీన్ ఆ చిత్రానికే హైలైట్. అందులో నిందితులతో అంత్యాక్షరి ఆడిన పవన్ కల్యాణ్, స్టెప్పులు కూడా వేయించారు. తానూ వారితో కాలు పదిపారు. అదంతా సినిమా. నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. అదెక్కడో కాదండోయ్... మన పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోనే. ఆ రాష్ట్రంలోని గౌరి బిదనూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాకు ఎక్కేసింది. వైరల్ అయిపోయింది. దీంతో, ఏదో సరదా కోసమని నిందితులతో డ్యాన్స్ చేయిస్తే, అది తమ తలకు చుట్టుకునేలానే ఉందని ఆ స్టేషన్ సిబ్బంది ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకెళితే... ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఐదుగురు యువకులను గౌరి బిదనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లాకప్ లోని నిందితులతో కాసేపు ఆడుకుందామనుకున్నారు. లాకప్ తాళం తీసిన పోలీసులు లోపలికి వెళ్లి, నిందితులతో బట్టలూడదీయించారు. కేవలం అండర్ వేర్ లపై మాత్రమే వారిని నిలబెట్టారు. నాగిని డ్యాన్స్ లు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లాఠీలు చేతబట్టిన పోలీసులు ఆదేశాలు అమలు చేయకపోతే ఏం జరుగుతుందో, నిందితులకు తెలుసు. ఇంకేముంది, చెడ్డీలు మాత్రమే ధరించిన స్థితిలో నిందితుల్లోని ఓ యువకుడు నాగిని పాటకు డ్యాన్స్ చేశాడు. కూర్చుని బుస కొట్టాడు. పడుకుని పాములా రౌండ్లు కొట్టాడు. దీనినంతటిని పోలీసు సిబ్బందిలోని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. దానిని చిన్నగా మీడియాకు అందజేశాడు. ఆ వీడియో ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది మెడకు చుట్టుకుంది.

  • Loading...

More Telugu News