: పార్లమెంటుకు రాలేమంటున్న ఎంపీలు... ముందే బడ్జెట్!
ఏప్రిల్ లోగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ముందే ఏర్పాటు చేయాలని 100 మందికి పైగా ఎంపీలు కోరుతున్న వేళ మోదీ సర్కారు ఆలోచనలో పడింది. ఈ ఐదు రాష్ట్రాల్లో 115 మంది ఎంపీలుండగా, వీరంతా ఎన్నికల ప్రచారం జోరుగా సాగించాల్సిన వేళ బడ్జెట్ సమావేశాలు వద్దని కోరుతుండటంతో, ముందుగానే బడ్జెట్ సమావేశాలు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తుది నిర్ణయం తీసుకునే ముందు ఓ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల తేదీలను మార్చే విషయమై గురువారం నాడు చర్చించాలని నిర్ణయించిన ప్రభుత్వం, అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించింది. కాగా, వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో, చివరి పనిదినాన ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రతిపాదనలను సభ్యుల ముందుంచుతారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 29న బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వస్తుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఎంపీల వెనుకంజతో తేదీలను మార్చేదిశగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం కానుండగా, అంతకుముందే అఖిలపక్ష సమావేశం జరుగనుంది.