: ముద్రగడపై కేసు... అరెస్ట్ చేస్తే ఏమవుతుందోనని వెనుకంజ!
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు నేతలపై మొత్తం 50 కేసులు పెట్టినట్టు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం తునిలో జరిగిన కాపు గర్జన సభ అనంతరం జరిగిన విధ్వంసం, రైలు దహనం, పోలీసు స్టేషన్లపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర ఘటనల్లో వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని తెలిపారు. అనుమతి తీసుకోకుండా సభను నిర్వహించారని వెల్లడించిన పోలీసులు, సభ జరిగిన ప్రదేశం యజమానిపైనా కేసు నమోదు చేశామన్నారు. అయితే, ముద్రగడను అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను అరెస్ట్ చేస్తే, కాపు సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఆయన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నామని ఓ అధికారి తెలిపారు. కాగా, తునిలో జరిగిన విధ్వంసంలో పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లా వాసులు ఉన్నట్టు వీడియో ఫుటేజీల ద్వారా గుర్తించామని పేర్కొన్నారు. సభకు అందిన నిధులపైనా విచారిస్తున్నట్టు తెలిపారు.