: ‘ఇన్ఫోసిస్’ నిర్మాణం.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన క్లాక్ టవర్ !
ప్రపంచంలోనే అత్యంత పొడవైన క్లాక్ టవర్ ను సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నిర్మించనుంది. కర్నాటకలోని మైసూరులో 345 ఎకరాల్లో ఉన్న గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఈ క్లాక్ టవర్ ను నిర్మిస్తున్నట్లు ‘ఇన్ఫోసిస్’ ప్రతినిధులు ప్రకటించారు. ఈ క్లాక్ టవర్ ఎత్తు 135 మీటర్లు. లండన్ లోని బిగ్ బెన్ (96 మీటర్లు), కాలిఫోర్నియాలోని హూవర్ టవర్ (87మీటర్లు), కార్నెల్ లోని మెక్ గ్రా టవర్(53 మీటర్లు) కంటే త్వరలో నిర్మించనున్న ఈ టవర్ ఎత్తు చాలా ఎక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ యూనివర్శిటీ అయిన ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో గోతిక్ స్టయిల్ లో, క్యాంపస్ లోని ఇతర బిల్డింగ్ ల కంటే ప్రత్యేక ఆకర్షణతో ఈ క్లాక్ టవర్ ను నిర్మించనున్నారు. 19 ఫ్లోర్లతో నిర్మితమయ్యే ఈ క్లాక్ టవర్ లోని ఏడవ ఫ్లోర్ లో బోర్డు రూమ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కు సుమారు 60 కోట్లు ఖర్చు అవుతుందని, 20 నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు.