: కోర్టు ముందుకు త్రేతాయుగపు సీతారాముల కేసు... వాదనలు సాగాయిలా!
నిన్న బీహార్ లోని ఓ కోర్టు ముందుకు వచ్చిన త్రేతాయుగపు నాటి సీతారాములు, లక్ష్మణుల కేసులో న్యాయస్థానం ఆసక్తికర ప్రశ్నలను సంధించింది. ఈ కేసులో పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ కేసులో ఎవరిని శిక్షించాలని ప్రశ్నించడం గమనార్హం. అంతకుముందు పిటిషనర్, స్వయంగా న్యాయవాది అయిన ఠాకూర్ చందన్ కుమార్ తన వాదన వినిపిస్తూ, చెప్పుడు మాటలు నమ్మి రాముడు సీతమ్మను అడవుల్లో విడిచి రమ్మన్నారని, లక్ష్మణుడు కూడా నిజాన్ని గ్రహించక, అన్న చెప్పిన మాటలు విన్నాడని వాదించారు. "నేను న్యాయస్థానంలో ఉన్నాను. సీతమ్మకు న్యాయం జరగాలని వేడుకుంటున్నా" అని అన్నారు. ఏ తప్పూ లేకుండానే రాముడు ఆమెను వదిలేశాడని, ఓ వ్యక్తి అంత క్రూరంగా సొంత భార్య పట్ల ఎలా ప్రవర్తించగలడని ప్రశ్నించారు. దట్టమైన అడవిలో ఆమె ఎలా ఉండగలుగుతుందని రాముడు ఒక్క క్షణమైనా ఆలోచించలేదని ఆరోపించారు. సీతమ్మ ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని మిథిలకు చెందిన అమ్మాయని, అందువల్లే కేసు ఇక్కడ వేశానని, తాను ఏ మత నమ్మకాన్నీ కించపరచాలని భావించడం లేదని తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి, త్రేతాయుగంలో జరిగిందని చెబుతున్న ఈ ఘటనలకు సాక్ష్యం ఎవరని అడిగారు. ఈ ఫిర్యాదుకు మూలమేంటని, ఎవరిని శిక్షించాలని ప్రశ్నించారు. కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది.