: ప్రపంచ స్థాయిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ


గర్భిణీ స్త్రీలపై పెను ప్రభావం చూపుతున్న జికా వైరస్ మరిన్ని దేశాలకు విస్తరిస్తుండగా, ప్రపంచ స్థాయిలో వైద్య అత్యయిక స్థితిని విధిస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా పుట్టే పిల్లల్లో లోపాలు పెరుగుతున్నాయని, దోమకాటు కారణంగా సోకే ఈ వైరస్ తో, అసాధారణమైన రీతిలో చిన్న తల, మెదడులతో పుట్టే చిన్నారుల్లో అత్యధికులు మరణిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓపై ఒత్తిడి పెరుగుతోంది. గత ఏడాది బ్రెజిల్ వాసులను గడగడలాడించిన జికా వైరస్ ప్రస్తుతం కొలంబియా సహా లాటిన్ అమెరికాలోని పలు దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. కేవలం కొలంబియాలోనే 2000 మందికి పైగా గర్భిణులకు జికా వైరస్ సోకిందని అధికారులు చెబుతున్నారు. కాగా, తాము ఎమర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించి, పరిస్థితిపై చర్చించామని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మార్గరెట్ చాన్ వెల్లడించారు. ఈ సంవత్సరం 40 లక్షల మందికి ఈ వైరస్ సోకవచ్చన్న అంచనాలున్నాయి. 1947లో తొలిసారిగా ఉగాండాలో ఈ వైరస్ వెలుగులోకి రాగా, అప్పటి నుంచి మరింతగా బలపడుతూ, ఇప్పుడు ప్రపంచానికే పెను సవాలుగా నిలిచింది. ఈ వైరస్ కు విరుగుడు కనుగొనే దిశగా పలు దేశాల సైంటిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News