: నేను ఒక్క మాట చెబితే చాలు...కాపులంతా నా వెంటే: ముద్రగడ
తాను ఒక్కమాట చెబితే చాలు, ఏం చేసేందుకైనా కాపులు వెనుకాడరని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాపులంతా తనతోనే ఉన్నారని అన్నారు. అందుకే తాను కాపులు విధ్వంసానికి దిగలేదని చెబుతున్నానని ఆయన చెప్పారు. తాను ఎవరికైనా 'విధ్వంసానికి దిగండి' అని చెప్పి ఉంటే, అలా జరిగి ఉండేది కానీ, తాను ఎవరికీ అలా చేయమని చెప్పలేదని ఆయన తెలిపారు. కేవలం రాస్తా రోకో, రైల్ రోకోకి మాత్రమే పిలుపునిచ్చానని ఆయన చెప్పారు. తాను విధ్వంసాన్ని ప్రోత్సహించే వ్యక్తిని కాదని ఆయన పేర్కొన్నారు. కాపుల ప్రయోజనం కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. తమ వెనుక ఎవరూ లేరని ఆయన మరోసారి స్పష్టం చేశారు.